ఈబీ5తో గ్రీన్‌కార్డు సులభం
విజయవాడ : అమెరికాలో స్థిరపడాలనుకున్న భారతీయులకు అక్కడి ప్రభుత్వం అమలు చేస్తున్న ఈబీ 5 పథకం ఒక సువర్ణ అవకాశమని ‘ది న్యూయార్క్ ఇమిగ్రేషన్ ఫండ్’ అటార్నీ ఇలియా ఫిష్‌కిన్ వెల్లడించారు. ఈ స్కీంలో పెట్టుబడిదారుల కుటుంబానికి గ్రీన్‌కార్డు వస్తుందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన తాజా షరతుల నేపథ్యంలో అక్కడికి వెళ్లాలనుకుంటున్న భారతీయులు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. వారి అపోహలు, ఆందోళనలు తొలగించేందుకు ఈబీ5 ఐవీఈ ఇమిగ్రేషన్ సర్వీస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమానికి ఇలియా ఫిష్‌కిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘అమెరికా ప్రభుత్వం పెట్టుబడిదారులకు మార్గనిర్దేశన చేయడానికి ఇమిగ్రేషన్ సర్వీసు ప్రాంతీయ కేంద్రాలను ప్రారంభించింది.వివిధ దేశాల నుంచి పెట్టుబడులతో వచ్చే వారికి ఈ ప్రాంతీయ కేంద్రాలు అవగాహన కల్పిస్తాయి. ఏ పెట్టుబడిదారుడైనా ఈ కేంద్రాల ద్వారా మాత్రమే రావాలి. కుటుంబంలో ఒక వ్యక్తి పెట్టుబడి పెడితే భార్యభర్తలతోపాటు 21 ఏళ్లలోపు వివాహం కాని పిల్లలకూ అమెరికా ప్రభుత్వం గ్రీన్‌కార్డు మంజూరు చేస్తుంది. దీనిపై వివిధ వర్గాలకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అమెరికాలో ఎక్కువ నిరుద్యోగ శాతం ఉన్న ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఆ ప్రాంతాల్లో కనీసం రూ.7 కోట్ల వరకు పెట్టుబడి పెట్టడంతోపాటు 10 మందికి ఉపాఽధి అవకాశాలను చూపించాలి. అటువంటి వారికి గ్రీన్‌కార్డు చాలా సులభంగా వస్తుంది’’ అని ఫిష్‌కిన్ వివరించారు. ఆయనతోపాటు ఈబీ5ఐబీఈ భాగస్వామి పి.సుబ్బరాజు ఉన్నారు.
Comments