మధ్యంతర ఉత్తర్వులు వెబ్‌సైట్‌లో పెట్టండి
అమరావతి : మోహన్‌బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) గుర్తింపు రద్దుతో పాటు ఇతర సిఫారసుల అమలు నిలుపుదలకు తామిచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ)ను హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో ఎంబీయూ వేసిన అనుబంధ పిటిషన్‌ను పరిష్కరించింది. ప్రధాన వ్యాజ్యంపై విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి గురువారం ఉత్తర్వులిచ్చారు. తిరుపతి జిల్లా రంగంపేటలోని తమ యూనివర్సిటీ గుర్తింపు రద్దుతో పాటు ఇతర చర్యల విషయంలో ఉన్నత విద్యా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సెప్టెంబరు 17న ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలని కోరుతూ గతంలో మోహన్‌బాబు వర్సిటీ రిజిస్ట్రార్ పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. కమిషన్ ఉత్తర్వులలోని పలు భాగాలపై స్టే విధిస్తూ సెప్టెంబరు 26న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ.26.17 కోట్లను 15 రోజుల్లో తిరిగి చెల్లించాలని, ఎంబీయూ గుర్తింపు రద్దు చేయాలని, పరిపాలన బాధ్యతలు ఎస్‌వీయూకు అప్పగించాలని చేసిన సిఫారసుల అమలును నిలుపుదల చేసింది. అయితే మధ్యంతర ఉత్తర్వులు జారీ తర్వాత కూడా ఆ ప్రొసీడింగ్స్‌ను ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎంబీయూ అనుబంధ పిటిషన్ వేసింది. ఇది గురువారం విచారణకు రాగా యూనివర్సిటీ తరఫున న్యాయవాది ఓ.మనోహర్‌రెడ్డి వాదనలు వినిపించారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వుల అనంతరం కూడా ఆ ప్రొసీడింగ్స్‌ను ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిందన్నారు. ఈ విషయాన్ని అన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయని చెప్పారు. కమిషన్ చర్యలతో యూనివర్సిటీ పరపతి దెబ్బతిందన్నారు. ప్రొసీడింగ్స్‌ను వెబ్‌సైట్ నుంచి తొలగించాలన్న తమ అభ్యర్థనను కమిషన్ పట్టించుకోలేదన్నారు.
మధ్యంతర ఉత్తర్వులను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ తాము స్టే ఉత్తర్వులు ఇచ్చిన తరువాత ప్రొసీడింగ్స్‌ను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం ఏమిటని కమిషన్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ తరఫున సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి బదులిస్తూ.. కమిషన్ అన్ని ప్రొసీడింగ్స్‌ను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా ఎంబీయూ గుర్తింపు రద్దు సిఫారసు ప్రొసీడింగ్స్‌ను సెప్టెంబరు 18నే అప్‌లోడ్ చేశామన్నారు. ప్రొసీడింగ్స్‌ను వెబ్‌సైట్‌లో ఉంచడం వెనుక దురుద్దేశం లేదన్నారు.
Comments