వెళ్లి ఆటో నడుపుకోమంటారు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టులో పేసర్ మహ్మద్ సిరాజ్ టెస్టు, వన్డే ఫార్మాట్లలో నిలకడగా చోటు దక్కించుకుంటున్నాడు. అయితే కెరీర్ ఆరంభంలో సరిగ్గా రాణించకపోవడంతో విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగితేనే ఫలితం ఉంటుందని సిరాజ్ చెబుతున్నాడు. ‘నువ్వు బాగా రాణిస్తే అభిమానులతో పాటు క్రీడాలోకం కూడా సిరాజ్‌లాంటి బౌలర్ మరొకరు లేడంటూ పొగుడుతారు. అదే విఫలమైతే.. ‘నువ్వేం బౌలర్‌వి? వెళ్లి మీ తండ్రితో కలిసి ఆటో నడుపుకో’ అంటూ విమర్శిస్తారు. అంత త్వరగా వీరు తమ అభిప్రాయాలను ఎలా మార్చుకుంటారు? అందుకే బయట నుంచి వచ్చే కామెంట్స్, విమర్శలను పట్టించుకోకూడదనుకున్నా. నా జట్టు సభ్యులు, కుటుంబం ఎలా ఆలోచిస్తున్నారన్నదే నాకు ముఖ్యం. ఇతరుల గురించి నాకనవసరం’ అని సిరాజ్ స్పష్టం చేశాడు. భారత జట్టులో చోటు దక్కించుకున్నప్పుడు ధోనీ కూడా తనకిదే సలహా ఇచ్చినట్టు గుర్తుచేసుకున్నాడు.
Comments