జట్టు సంస్కృతి దెబ్బతినకూడదనే
ముంబై: ఆస్ట్రేలియాలో పర్యటనకు ఇటీవల ప్రకటించిన భారత జట్టులో రోహిత్ శర్మ స్థానంలో శుభ్‌మన్ గిల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. టీ20లు, టెస్ట్‌ల నుంచి వైదొలగిన హిట్‌మ్యాన్ కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నాడు. కానీ ఒక ఫార్మాట్‌కే సారథిగా ఉన్న రోహిత్ తనదైన శైలిలో జట్టును నడిపిస్తాడని.. అది జట్టుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నట్టు సమాచారం. ‘రోహిత్ స్థాయి ఆటగాడు నాయకత్వ బాధ్యతల్లో ఉంటే..డ్రెస్సింగ్ రూమ్‌లో తనదైన ముద్ర వేస్తాడు. ఒకే ఫార్మాట్‌లో.. అది కూడా ఎప్పుడో జరిగే వన్డేలకు అతడు కెప్టెన్‌గా ఉండడం జట్టు సంస్కృతిని దెబ్బ తీస్తుంది’ అని బీసీసీఐ ముఖ్యుడొకరు వెల్లడించారు. కోచ్‌గా నియమితుడైన గంభీర్ తొలి ఆరు నెలలు జట్టుపై ఏమాత్రం పట్టు సాధించలేకపోయాడట. అయితే న్యూజిలాండ్‌తో స్వదేశంలో, ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు టెస్ట్‌లు ఓడిపోవడం గంభీర్‌కు కలిసొచ్చింది. ఆ రెండు సిరీస్‌లలో పరాజయాల అనంతరం కోచ్‌గా గంభీర్ జట్టును తన చేతుల్లోకి తీసుకున్నాడట.
వన్డే వరల్డ్ కప్‌కు జట్టును సన్నద్ధం చేసే క్రమంలో రోహిత్ శర్మను సారథ్య బాధ్యతల నుంచి తప్పించి ఉంటారని దిగ్గజ బ్యాటర్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఈ నిర్ణయంతో రోహిత్ కూడా ఏకీభవిస్తాడని చెప్పాడు. ‘2027 ప్రపంచ కప్‌కు రోహిత్ సిద్ధంగా ఉంటాడో లేదో తెలియదు. అతడు వన్డేలే ఆడుతున్నాడు. అంతర్జాతీయ కేలండర్‌ను చూస్తే భారత జట్టు పెద్దగా 50 ఓవర్ల మ్యాచ్‌లు ఆడబోవడంలేదు. ఏడాదికి ఐదు నుంచి ఏడు వన్డేలు ఆడితే వరల్డ్ కప్‌లాంటి పెద్ద టోర్నీకి కావాల్సినంత మ్యాచ్ ప్రాక్టీస్ లభించదు. అందుకే శుభ్‌మన్‌ను సన్నద్ధం చేసేందుకు కెప్టెన్సీపై నిర్ణయం తీసుకొని ఉంటారు. పైగా..50 ఓవర్ల ఫార్మాట్‌కు జట్టు యాజమాన్యం ప్రణాళికలను పటిష్టం చేసుకోవాలని భావిస్తున్నందున రాబోయే రోజుల్లో మరిన్ని చేదు వార్తలు వినాల్సి రావొచ్చు’ అని గవాస్కర్ అన్నాడు. అంటే..రోహిత్ వన్డేలకూ వీడ్కోలు పలుకుతాడన్న అభిప్రాయాన్ని గవాస్కర్ పరోక్షంగా చెప్పాడన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
గిల్‌పై అగార్కర్
ఒత్తిడి తెచ్చాడు !
వన్డే జట్టు సారథ్యం నుంచి రోహిత్‌ను తొలగించడాన్ని టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ తప్పుబట్టాడు. అంతేకాదు..వన్డే జట్టు కెప్టెన్సీ చేపట్టాలని గిల్‌పై చీఫ్ సెలెక్టర్ అగార్కర్ ఒత్తిడి తెచ్చి ఉంటాడని అభిప్రాయపడ్డాడు.
Comments