• Oct 10, 2025
  • NPN Log

    విశాఖపట్నం : వన్డే వరల్డ్‌క్‌పలో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత మహిళల జట్టుకు ఇక అసలు సిసలు సవాళ్లు ఎదురు కానున్నాయి. గురువారం బలమైన దక్షిణాఫ్రికాతో భారత్‌ తలపడనుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో శ్రీలంక, పాకిస్థాన్‌పై హర్మన్‌ సేన నెగ్గినా.. బ్యాటింగ్‌లో తడబాటు కనిపించింది. మెరుగ్గా ఆరంభించినా ఒక్కసారిగా కుప్పకూలుతున్నారు. ముఖ్యంగా టాపార్డర్‌ వైఫల్యం కలవరపెడుతోంది. మెగా టోర్నీకి ముందు పరుగుల వరద పారించిన ఓపెనర్‌ స్మృతి మంధాన రెండు మ్యాచ్‌ల్లో 8, 23 పరుగులే చేయడం ఆందోళన కలిగిస్తోంది. స్పిన్‌ను ఎదుర్కోవడంలో ప్రతీకా రావల్‌ బలహీనతను పసిగట్టిన ప్రత్యర్థులు.. పవర్‌ప్లేలో ఆమెను కట్టడి చేసేందుకు స్పిన్నర్లను బరిలోకి దించుతున్నారు. వన్‌డౌన్‌లో హర్లీన్‌ డియోల్‌ స్ట్రయిక్‌ రేట్‌ కూడా ఘోరంగా ఉంది. క్రీజులో కుదురుకోవడానికి ఎక్కువ బంతులు తింటున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బ్యాటింగ్‌కు వెన్నెముక అయిన కెప్టెన్‌ హర్మన్‌ కూడా భారీ స్కోర్లు చేయలేక పోతుండడంతో ఆ భారం లోయరార్డర్‌పై పడుతోంది. గత మ్యాచ్‌ల్లో దీప్తి, రిచా, అమన్‌జోత్‌, రాణా ఆదుకోవడంతో పరువు దక్కింది. కాగా, పాక్‌తో మ్యాచ్‌లో అనారోగ్యంతో పేస్‌ ఆల్‌రౌండర్‌ అమన్‌జోత్‌ దూరం కావడంతో తుది జట్టులో చోటు దక్కించుకొన్న ఫాస్ట్‌ బౌలర్‌ రేణుక మెరుగైన గణాంకాలనే నమోదు చేసింది. అయితే, అమన్‌జోత్‌ ఫిట్‌నెస్‌పై ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు. దీప్తి, శ్రీచరణి, స్నేహ్‌ రాణాలతో స్పిన్‌ విభాగం బలంగా కనిపిస్తోంది. మరోవైపు న్యూజిలాండ్‌పై ఆరు వికెట్లతో నెగ్గిన సౌతాఫ్రికా ఫుల్‌జో్‌షలో ఉంది. తన్జిమ్‌ బ్రిట్స్‌, సునె లుస్‌ చక్కని ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్‌ లారా వొల్వార్డ్‌, మరిజానె ఖాప్‌, బోష్‌ కూడా చెలరేగితే ప్రత్యర్థికి కష్టాలు తప్పవు. అయోబొంగా కకా, కాప్‌, ట్రయన్‌ లాంటి అనుభవజ్ఞులైన బౌలర్ల నుంచి భారత బ్యాటర్లకు కఠిన పరీక్ష ఎదురుకానుంది.

    పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం కావడంతో భారీ స్కోర్లు నమోదు కావచ్చు. కాగా, ఒక మోస్తరు నుంచి భారీవర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో 50 ఓవర్ల పూర్తి మ్యాచ్‌ జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).