టాస్క్‌ల పేరిట ఎర... ఐటీ ఉద్యోగికి 54 లక్షల టోకరా
పటాన్‌చెరు : ఉన్నత విద్య అభ్యసించి ప్రముఖ సంస్థలో పని చేస్తున్న ఓ ఐటీ ఉద్యోగి అదనపు ఆదాయానికి ఆశపడి సైబర్ నేరగాళ్ల మాయకు బలయ్యాడు. బ్రాండెడ్ వస్తువులకు రేటింగ్ ఇస్తే పెద్ద మొత్తంలో కమీషన్ ఇస్తామంటూ ఎర వేసి టాస్క్‌ల పేరిట ఓ సైబర్ నేరా ముఠా ఆడిన ఆటకు ఏకంగా రూ.54 లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితుడి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. హెచ్‌సీఎల్ సంస్థలో ఐటీ ఉద్యోగి అయిన బాధితుడు పటాన్‌చెరు ప్రాంతంలో నివాసముంటున్నాడు. సదరు ఐటీ ఉద్యోగి వాట్సా్‌పకు సెప్టెంబరు19న గుర్తు తెలియని ఓ నెంబర్‌ను మెసేజ్ వచ్చింది. తాము పంపిన ఆన్‌లైన్ లింక్ ఓపెన్ చేసి అందులోని బ్రాండెడ్ వస్తువులకు రేటింగ్ ఇస్తే ఆ టాస్క్‌లకు బదులుగా పెద్ద మొత్తంలో కమీషన్ ఇస్తామని ఆ మెసేజ్ సారాంశం. దీంతో బీ-ఏజియోమాల్ టాస్క్-653 పేరిట ఆ మెసేజ్‌లో ఉన్న టెలీగ్రామ్ లింక్‌ను బాధితుడు క్లిక్ చేసి అందులో చేరాడు. అందులో సూచించిన రెండు టాస్క్‌లు పూర్తి చేశాడు. ఆ వెంటనే బాధితుడి బ్యాంకు ఖాతాలో రూ.5వేలు జమ అయ్యాయి. దీంతో అత్యాశకు లోనైన బాధితుడు మరిన్ని టాస్క్‌లు చేసేందుకు సిద్ధమవ్వగా... టాస్క్‌లు కొనుగోలు చేయాలని సైబర్ మాయగాళ్లు బదులిచ్చారు. దీంతో తొలుత రెండు టాస్క్‌ల కొనుగోలుకు బాధితుడు పేటీఏమ్ ద్వారా రూ.12,500 చెల్లించాడు. ఆ టాస్క్‌లకు సంబంధించిన ఆదాయం ఖాతాలో కనిపిస్తుండడంతో నమ్మిన బాధితుడు టాస్క్‌ల కొనుగోలు పేరిట విడతల వారీగా రూ.7,14,180 సైబర్ నేరగాళ్లు చెప్పిన విధంగా ఆన్‌లైన్‌లో బదిలీ చేశాడు. ఆపై, క్రెడిట్ స్కోర్ కోసం రూ. 5లక్షలు, అదనపు కమీషన్ కోసం వీఐపీ చానల్ తెరిచేందుకు రూ.6లక్షలు, నగదు విత్‌డ్రాకు మరో రూ.12లక్షలు ఇలా మొత్తంగా బాధితుడు రూ.54,67, 488లు సైబర్ ముఠాకు చెల్లించాడు. ఈ మొత్తం లాభంతో కలిపి రూ.70లక్షలు అని ఖాతాలో చూపిస్తుండగా వాటిని విత్‌డ్రా చేసుకునేందుకు బాధితుడు ప్రయత్నించగా.. విత్‌డ్రా చేయాలంటే మరో రూ.8లక్షలు చెల్లించాలని సైబర్ ముఠా బదులు ఇచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సాయం కోసం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కాగా, సులువుగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో సైబర్ ముఠాల మాయలో పడవద్దని ప్రజలకు పటాన్‌చెరు సీఐ రాజు సూచించారు.
Comments