పలు జిల్లాల్లో జోరు వాన
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం జోరు వాన కురిసింది. ఉమ్మడి కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. జగిత్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత కురిసింది. ఎండపల్లిలో 8.3 సెం.మీ, మల్యాల మండలం మద్దుట్లలో 6.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. కరీంనగర్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. సైదాపూర్ మండలం వెన్కేపల్లి, తిమ్మాపూర్ మండలం రేణికుంటలో 6.4 సెం.మీ. వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వాన దంచి కొట్టింది. సిరిసిల్లలో 6.4 సెం.మీ, కోనరావుపేటలో 6 సెం.మీ వర్షం కురిసింది. పెద్దపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా బషీరాబాద్ మండలంలో 7 సెం.మీ వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల డివిజన్‌లోని. చేవెళ్ల, శంకర్‌పల్లి, మొయినాబాద్, షాబాద్ తదితర మండలాల్లో 3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం రవీంద్రనగర్‌లో 5.7 సెం.మీ వర్షం కురిసింది. కాగా, పిడుగుపాటుతో మహిళా కూలీ మృతి చెందింది. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుమ్మళ్లపల్లికి చెందిన ఇసునం లక్ష్మి(50) పత్తి చేనులో పని చేస్తుండగా పిడుగు పడి మృతి చెందింది. మహాముత్తారం మండలం బోర్లగూడెంలో పిడుగుపాటుకు గురై దుక్కిటెద్దు మృతి చెందింది.
నేడు, రేపు తేలికపాటి వర్షాలు
రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ములుగు జిల్లా ఏటూరునాగారంలో అత్యధికంగా 10 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Comments