భారత క్రికెట్లో గంభీర్ దుమారం!
ఆస్ట్రేలియాలో జరిగే పర్యటనకు భారత వన్డే జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మను తొలగించడం..దేశ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు టీ20లకు, టెస్ట్‌లకు ఇప్పటికే వీడ్కోలు పలికిన టీమిండియా దిగ్గజ ద్వయం రోహిత్-కోహ్లీని వన్డేల నుంచీ తప్పించాలన్న కుట్ర జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రోహిత్‌ను వన్డే జట్టు సారథ్య బాధ్యతల నుంచి తొలగించారనేది కొందరి వాదన. రెండు ఫార్మాట్లనుంచి రోహిత్, కోహ్లీ తప్పుకొనేలా చేయడంతోపాటు మిగిలిన వన్డేల నుంచీ వారు వైదొలగేలా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కుట్ర పన్నుతున్నాడని రో-కో అభిమానులు దుయ్యబడుతున్నారు. అలాగే ఈ ఇద్దరు గొప్ప క్రికెటర్ల కెరీర్‌లకు పొమ్మనలేక పొగబెడుతున్నాడని గంభీర్‌పై మాజీ ఆటగాడు మనోజ్ తివారీ ధ్వజమెత్తడం కీలక తాజా పరిణామం. మరోవైపు ముంబైలో జరిగిన సియెట్ క్రికెట్ అవార్డుల కార్యక్రమంలో రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారి తీశాయి. చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు టైటిల్ గెలిచేందుకు గత కోచ్ రాహుల్ ద్రవిడ్ ముందుచూపు, అతడి కోచింగ్ నైపుణ్యాలే కారణమని రోహిత్ స్పష్టంజేశాడు. దాంతో..టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలవడంలో గంభీర్ పాత్ర లేదని తమ స్టార్ తేల్చేశాడని రోహిత్ ఫ్యాన్స్ అంటున్నారు.
గంభీర్ తీరుతో వివాదాలు: మనోజ్ తివారీ
మాజీ ఆటగాడు మనోజ్ తివారీ చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం సృష్టించాయి. ‘గంభీర్ కోచ్ అయ్యాకనే ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న అశ్విన్ అర్ధంతరంగా కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. రోహిత్, కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్‌నుంచి రిటైర్ అయ్యారు. రోహిత్, కోహ్లీ, అశ్విన్‌లకు ప్రస్తుత కోచ్ కంటే చాలా పేరు ప్రఖ్యాతులున్నాయి. జట్టుకు నచ్చని విషయాలను సీనియర్లు వ్యతిరేకిస్తారనే ఉద్దేశంతోనే వారు జట్టులో లేకుండా కోచ్ చూసుకుంటున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ జట్టులో రో-కో లేకపోతే అది గంభీర్ చెత్త నిర్ణయం అవుతుంది’ అని మనోజ్ వ్యాఖ్యానించాడు.
ఏకమైన రో-కో ఫ్యాన్స్
గంభీర్‌కు వ్యతిరేకంగా రోహిత్, విరాట్ అభిమానులు ఒక్కటయ్యారు. తన అహంకారాన్ని సంతృప్తి పరుచుకొనేందుకు తమ స్టార్లిద్దరి కెరీర్‌లను గంభీర్ నాశనం చేశాడని దుయ్యబడుతున్నారు. జట్టునుంచి గౌరవ మర్యాదలు పొందలేని అతడు సీనియర్ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. గంభీర్ వల్లే తమ స్టార్లకు ఈ పరిస్థితి ఏర్పడిందని రో-కో ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
Comments