యదు వంశీతో.. మెగా డాటర్ నిహారిక మరో సినిమా
గత సంవత్సరం చిన్న బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న 'కమిటీ కుర్రోళ్ళు' సినిమా అందరినీ బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో యంగ్ డైరెక్టర్ యదు వంశీ కి మంచి మార్కులే పడ్డాయి. పైగా 11 మంది కొత్త హీరోలతో పాటు నాలుగురు హీరోయిన్స్ ను తెలుగు సినీ ప్రపంచానికి పరిచయం చేశారు. కేవలం రూ.9 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ రూ. 24 కోట్లకు పైగా వసూళ్లు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాంటి డైరెక్టర్ మరో ప్రయోగానికి రెడీ అవ్వడం హాట్ టాపిక్ గా మారుతోంది.
‘కమిటీ కుర్రోళ్ళు’ తో సంచలన విజయాన్ని అందుకున్న పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మరో కొత్త ప్రాజెక్ట్ కు రంగం సిద్ధమవుతోంది. దర్శకుడు యదు వంశీ, నిర్మాత నిహారిక కొణిదెల కలిసి మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరూ కలిసి చర్చలు జరిపినట్లు టాక్. అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2026లో ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
నిహారిక ఇప్పటికే ఫాంటసీ, కామెడీ జానర్ లో సంగీత్ శోభన్ , నయన్ సారిక తో ఓ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తోంది. దీనికి మానస, మహేష్ ఉప్పాల్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సమకూర్చుకున్నారు. అనుదీప్ దేవ్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలోనూ నిహారిక మరో సినిమా గురించిన ప్రకటన చేయడం విశేషం.
‘కమిటీ కుర్రోళ్ళు’ కేవలం బాక్సాఫీస్ హిట్ కావడమే కాకుండా, అవార్డుల విషయంలోనూ సత్తా చాటింది. సైమా అవార్డులలో నిహారిక బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్ అవార్డును గెలుచుకోగా.... సందీప్ సరోజ్ బెస్ట్ డెబ్యూ యాక్టర్‌గా అవార్డును అందుకున్నాడు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డులలో డైరెక్టర్ యదు వంశీ ఉత్తమ నూతన దర్శకుడి అవార్డును సొంతం చేసుకున్నాడు. అంతేకాక జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును 'కమిటీ కుర్రాళ్ళు' దక్కించుకుంది. మరి మరోసారి నిహారిక, యదు వంశీ కాంబోలో తెరకెక్కే చిత్రం ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Comments