రూ.1.09 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు.. ఎలా జరిగిందంటే..
హైదరాబాద్ సిటీ: నెట్ కనెక్షన్ కస్టమర్ కేర్ నంబర్‌ను గూగుల్‌లో వెదికిన నగరవాసి సైబర్ నేరగాళ్ల బారిన పడి రూ.1.09 లక్షలు పోగొట్టుకున్నాడు. బహదూర్‌పురా కు చెందిన యువకుడు (30) ఈ నెల ఒకటిన యాక్ట్ ఫైబర్ సర్వీసుల కోసం ఆన్‌లైన్‌లో వెదికాడు. అందులో వచ్చిన నంబర్‌కు ఫోన్ చేశాడు. కొద్ది సేపటి తర్వాత వాట్సప్ కాల్ చేసిన సైబర్ నేరగాడు వైఫై రిజిస్ట్రేషన్ కోసం తాను పంపిన క్యూఆర్ కోడ్‌కు రూ.2 పంపాలని కోరాడు.
తర్వాత కోడ్‌లు ఎంటర్ చేయాలని సూచించాడు. అతడి సూచనల మేరకు అతడు పంపిన లింక్‌లో 90,500, 8500 నెంబర్లు కొట్టాడు. ఈ సమయంలో అతడి హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతా నుంచి రూ.90,500, ఇంకోసారి రూ8,500 వేరే ఖాతాలకు బదిలీ అయినట్లు గుర్తించాడు. దీనిపై ప్రశ్నించగా 24 గంటల్లో డబ్బు మీ ఖాతాలో జమ అవుతుందని సైబర్ నేరగాడు చెప్పాడు.
దాని కోసం పే జాప్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించాడు. సైబర్ నేరగాడు చెప్పిన విధంగా పేజాప్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకున్న బాధితుడి ఖాతా నుంచి మరో రూ. 10 వేలు కాజేశారు. ఇలా మూడు సార్లు రూ.1.09 వేలు బ్యాంకు ఖాతాల నుంచి మాయం కావడంతో మోసపోయానని గ్రహించి బాధితుడు సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు.
Comments