విపత్తుల శాఖకు దన్నుగా..
అమరావతి : విపత్తుల సమయంలో ప్రజలను రక్షించి, వారి ఆస్తులను కాపాడే విపత్తుల నిర్వహణ శాఖను బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త అగ్నిమాపక కేంద్రాల నిర్మాణం, ఫైరింజన్ల కొనుగోలు, సిబ్బందికి శిక్షణ, అధునాతన పరికరాల కల్పనతో ఈ శాఖను బలోపేతం చేయనుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు తదితర ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రమాదాలు సంభవించి పదుల సంఖ్యలో ప్రజలు, కార్మికుల ప్రాణాలు పోయినా విపత్తుల శాఖ అభివృద్ధిని నాటి సీఎం జగన్ పట్టించుకోలేదు. కనీసం కేంద్రం ఇచ్చే నిధులకు రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకుండా అన్యాయం చేసింది. 2024లో జరిగిన ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఏర్పడటంతో కేంద్ర ప్రభుత్వం రూ.189.65 కోట్లు(75శాతం), రాష్ట్ర ప్రభుత్వం రూ.63.22 కోట్లు(25శాతం) కలిపి మొత్తం రూ.252.87కోట్ల నిధుల విడుదలకు అనుమతి ఇస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. మొదటి విడతలో రూ.62.92కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం మిగతా మూడు విడతల నిధులకు పాలనాపరమైన అనుమతులు ఇవ్వడంతో అగ్నిమాపక శాఖలో అభివృద్ధి పరుగులు తీయనుంది. ఈ నిధులతో తొలుత కొత్తగా 17ఫైర్‌స్టేషన్లు నిర్మించనున్నారు. ఇప్పటికే ఉన్న 36 స్టేషన్లకు మరమ్మతులు చేస్తారు. ఈ పనులు త్వరలోనే ప్రారంభంకానున్నాయి. ఇంకా కొత్త కేంద్రాల నిర్మాణం, అమరావతిలో అంతర్జాతీయ స్థాయి శిక్షణ కేంద్రం ఏర్పాటు, కొత్త ఫైరింజన్ల కొనుగోలు, సిబ్బందికి అవసరమైన పరకరాలు కొనుగోలుకు టెండర్లు పిలవనున్నారు.
Comments