షాడో కలెక్టర్‌గా జడ్పీ సీఈవో!
వరంగల్ : జిల్లా పరిషత్‌కు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన జడ్పీ సీఈవో.. కలెక్టరేట్‌లో చక్రం తిప్పుతున్నారు. తనకు సంబంధంలేని శాఖల ఫైళ్లన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు. ఏ శాఖ ఫైలు అయినా జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్లాలంటే ముందుగా జడ్పీ సీఈవో ఆమోదం పొందాల్సిందే. ఆయన కాదంటే ఆగిపోవాల్సిందే. వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో ఈ పరిస్థితి నెలకొంది. పైగా, జడ్పీ సీఈవోకు ఈ అధికారాలను స్వయంగా జిల్లా కలెక్టరే కల్పించడం వివాదాస్పదంగా మారింది. వివిధ శాఖల నుంచి వచ్చే ఫైళ్లను జడ్పీ సీఈవో పరిశీలన తరువాతే తన వద్ద తీసుకురావాలంటూ జిల్లా కలెక్టర్ సత్యశారద ఈ ఏడాది జనవరి 18న ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసమంటూ ఈ ఉత్తుర్వులిచ్చిన కలెక్టర్.. అందులో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ), జిల్లా పంచాయతీ కార్యాలయ పైళ్ల ప్రాసెసింగ్‌ను జడ్పీ సీఈవో ద్వారా చేయాలని పేర్కొన్నారు. దీంతో డీపీవో, డీఆర్‌డీఏకు చెందిన ఏ పని కావాలన్నా ఆ శాఖల ఉద్యోగులు జడ్పీ సీఈవో రాంరెడ్డిని కలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇవేకాకుండా సంక్షేమశాఖ, విద్యాశాఖ ఫైళ్లు కూడా సీఈవో టేబుల్‌పైకి వెళ్లాకే కలెక్టర్ వద్దకు చేరుతున్నాయనే చర్చ జరుగుతోంది. పలు శాఖలకు సంబంధించి జిల్లా కలెక్టర్ నిర్వహిస్తున్న సమీక్షలకు, జిల్లాలో కలెక్టర్ చేపడుతున్న తనిఖీలకు కూడా జడ్పీ సీఈవో హాజరవుతున్నారు. దీంతో ఈ పరిణామాలను ఇతర అధికారులు, ఉద్యోగులు తప్పుబడుతున్నారు.
సంబంధం లేని శాఖల్లో పెత్తనం..
ఒక శాఖకు చెందిన జిల్లా స్థాయి అధికారి తనకు సంబంధం లేని మరో శాఖకు చెందిన జిల్లా స్థాయి అధికారి వద్దకు పైళ్లు తీసుకెళ్లాల్సిరావడం ఏమిటని ఇతర అధికారులు ప్రశ్నిస్తున్నారు. జడ్పీ సీఈవో రాంరెడ్డి గతంలో జనగామ డీఆర్‌డీఏగా పని చేశారు. కాగా, వరంగల్ డీఆర్‌డీఏగా పనిచేసిన కౌసల్యాదేవి కన్నా ఆయన జూనియర్. దీంతో తన కన్నా జూనియర్ వద్దకు ఫైళ్లు తీసుకెళ్లడమేంటని కౌసల్యాదేవి ప్రశ్నించడంతో ఆమెపై పైఅధికారులకు తప్పుడు నివేదికలు ఇచ్చి బదిలీ చేయించారనే ఆరోపణలున్నాయి. ఖాళీ అయిన ఆ స్థానంలో డీఆర్‌డీఏ ఇన్‌చార్జిగా రాంరెడ్డినే కలెక్టర్ నియమించారు. ఇక కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులతో జడ్పీ సీఈవో తన పరిధిని మించి అన్ని శాఖల్లో జోక్యం చేసుకుంటూ షాడో కలెక్టర్‌గా మారారనే ప్రచారం జరుగుతోంది. ఏకంగా వైద్యశాఖపై కలెక్టరేట్‌లో సీఈవో సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ, రెవెన్యూ శాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖ.. ఇలా అన్ని శాఖల ఫైళ్లకూ తొలుత సీఈవో వద్ద ఆమోదముద్ర వేయించుకున్నాకే.. కలెక్టర్ వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని అధికారులు వాపోతున్నారు. గ్రీవెన్స్‌లో వచ్చే ఫైళ్లను సైతం సీఈవో అనుమతి ఉంటేనే పరిష్కరిస్తున్నారని చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ధరణిలో జరిగిన తప్పులను పరిష్కరించాలంటూ వస్తున్న బాధితులకు గేటు వద్దే సీఈవో చెక్ పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఆదేశించినా కలెక్టరేట్‌లో ఫైల్ ముందుకు కదలడం లేదని చెబుతున్నారు. దేశాయిపేటకు చెందిన ఓ వ్యక్తి వ్యవసాయ భూమి వివాదాన్ని పరిశీలించి పరిష్కరించాలని మంత్రి ఆదేశించగా.. సీఈవో అనుమతి లేనందునే పరిష్కారం కాలేదని పేర్కొంటున్నారు. ఈ విషయంపై పలువురు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఫిర్యాదు చేసినట్లు, దీంతో జడ్పీ సీఈవోకు లేని అధికారాలు కల్పించిన కలెక్టర్‌ను సీఎ్‌సను మందలించినట్లు తెలిసింది.
Comments