ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలి
అమరావతి/కర్నూలు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ నెల 16న ప్రధాని కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్న నేపథ్యంలో ఆ ఏర్పాట్లపై సీఎం బుధవారం అధికారులతో సమీక్షించారు. శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జునస్వామిని పీఎం దర్శించుకుంటారు. ఆ తర్వాత కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరులో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు. ఈ సభను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో మంత్రులు లోకేశ్, బీసీ జనార్ధన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేశ్, సీఎస్ విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల ప్రత్యేక అధికారి వీరపాండియన్ నేతృత్వంలో కలెక్టర్ అట్టాడ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జేసీ బి.నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పర్యవేక్షణలో నన్నూరులో చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని సభకు సుమారు మూడు లక్షల మందికిపైగా హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు. సుమారు 450 ఎకరాల్లో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభ ఏర్పాట్లపై కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు ఎ.సిరి, రాజకుమారి, ఎస్పీలు విక్రాంత్ పాటిల్, సునీల్ షెరాన్‌లతో సీఎం చంద్రబాబు బుధవారంవీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భద్రత ఏర్పాట్లపై అదనపు డీజీ మధుసూదన్‌రెడ్డి, ఐజీ శ్రీకాంత్, డీఐజీలు కోయ ప్రవీణ్, సెంథిల్ కుమార్, సత్యయేసు బాబు, ఫక్కీరప్పతో కలిసి సమీక్షించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సభా ప్రాంగణానికి వచ్చి ఏర్పాట్లను పరిశీలించారు.
15న వామపక్షాల నిరసన ర్యాలీ
మోదీ కర్నూలు పర్యటనను వ్యతిరేకిస్తూ ఈనెల 15న కర్నూలులో పది వామపక్ష పార్టీలతో భారీ నిరసన ర్యాలీ చేపడతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. జీఎస్టీ విజయోత్సవం పేరుతో ప్రధానిని రాష్ట్రానికి ఆహ్వానించి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం సిగ్గుచేటని విమర్శించారు.
Comments