ముంబై ఉగ్రదాడుల తర్వాత.. పాక్‌పై సైనిక చర్య వద్దన్నదెవరు
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముంబైలో 26/11 ఉగ్రదాడులు తర్వాత పాకిస్థాన్‌పై భారత్ సైనిక చర్య ఎందుకు చేపట్టలేదో కాంగ్రెస్ పార్టీ చెప్పాలని బుధవారం డిమాండ్ చేశారు. ఓ విదేశీ శక్తి నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి పాక్‌పై సైనిక చర్య చేపట్టకూడదనే నిర్ణయం తీసుకున్నది ఎవరు? అనేది కూడా దేశ ప్రజలకు చెప్పాలని స్పష్టం చేశారు. ముంబై సమీపంలో రూ.19,650 కోట్ల వ్యయంతో కొత్తగా నిర్మించిన నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1ను, రూ.12.200 కోట్ల వ్యయంతో నిర్మించిన ముంబై మెట్రో లైన్-3(ఫేజ్ 2బీ)ని, ముంబైలోని వేర్వేరు ప్రజారవాణా వ్యవస్థల టికెటింగ్‌కు సంబంధించిన ముంబై వన్ యాప్, మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ముంబై దాడుల అనంతర పరిణామాలపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఇటీవల చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ‘‘2008 ముంబై దాడుల అనంతరం పాక్‌పై దాడి చేసేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉన్నప్పటికీ ఓ దేశం నుంచి ఎదురైన ఒత్తిడి వల్ల నాటి కాంగ్రెస్ ప్రభుత్వం సైన్యాన్ని అడ్డుకుందనే విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోం మంత్రి ఒకరు ఇటీవల బయటపెట్టారు. ఓ విదేశీ శక్తి నుంచి ఎదురైన ఒత్తిడికి తలొగ్గి పాక్‌పై దాడి చెయ్యకూడదు అనే నిర్ణయం తీసుకున్నది ఎవరో కాంగ్రెస్ చెప్పి తీరాలి. కాంగ్రెస్ బలహీనత ఉగ్రవాదులను శక్తిమంతులను చేసింది. కాంగ్రెస్ చేసిన తప్పు వల్ల ఎంతోమంది ప్రాణాలను త్యాగం చేస్తూ దేశం మూల్యం చెల్లిస్తూనే ఉంది. దేశ భద్రత విషయంలో కాంగ్రెస్ రాజీ పడింది.
కానీ, దేశ రక్షణ, ప్రజల భద్రత మాకు అన్నింటి కంటే ముఖ్యం’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశ భద్రత విషయంలో కాంగ్రెస్ రాజీ పడితే తమ హయాంలో శత్రువుల ఇళ్లలోకి చొరబడి మరీ ఉగ్రదాడులకు భారత్ ధీటుగా బదులిస్తుందంటూ మోదీ పేర్కొన్నారు. ముంబై దాడుల అనంతరం పాక్‌పై యుద్ధాన్ని ప్రారంభించవద్దని అంతర్జాతీయంగా, ముఖ్యంగా అమెరికా నుంచి నాటి యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చిందని చిదంబరం ఇటీవల పేర్కొన్నారు. కాగా, అవినీతితో గత ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులను అధిగమించి, ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు తెరదించుతూ ముంబైలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీ నేతృత్వంలో గత 11 ఏళ్లలో దేశం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతూనే ఉందన్నారు. 2014లో తాను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సమయానికి దేశంలో 74 విమానాశ్రయాలు ఉండగా ఆ సంఖ్య 160 కంటే పెరిగిందన్నారు. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా భారత్ వృద్ధి చెందిందన్నారు. విమానాల నిర్వహణ, మరమ్మతులు, ఓవర్‌హాలింగ్‌కు 2030 నాటికి భారత్ ప్రపంచానికే కేంద్రంగా మారుతుందని మోదీ ప్రకటించారు. కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం, అండర్ గ్రౌండ్ మెట్రో కారిడార్ ప్రారంభంతో ఆసియాలోనే అతిపెద్ద కనెక్టవిటీ హబ్‌గా ముంబై నిలవనుందని పేర్కొన్నారు. విమానాశ్రయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ... ఎన్డీయే ప్రభుత్వ హయాంలో గత 11 ఏళ్లలో దేశంలో 90నూతన విమానాశ్రయాల నిర్మాణం జరిగిందన్నారు. ఇక, నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి దివంగత దిన్‌కర్ బాలు పాటిల్ పేరు పెడతామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించారు.
కప్పు టీ కంటే 1జీబీ డేటా చవక
ఒక కప్పు టీ కంటే తక్కువ ధరకు దేశంలో 1జీబీ వైర్‌లెస్ డేటా దొరుకుతోందని మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సును మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భౌగోళిక అనుకూలతలు, ప్రభుత్వం పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్న తీరు, సులభతర వాణిజ్య విధానాలు భారతదేశాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చిందన్నారు. ప్రపంచలోనే రెండో అతి పెద్ద టెలికామ్ మార్కెట్, అతి పెద్ద 5జీ మార్కెట్‌తోపాటు మానవ వనరులు, మార్పును ఆహ్వానించే తత్వం కలిగిన భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే తగిన సమయమని పేర్కొన్నారు. మేడిన్ ఇండియా 4జీ స్టాక్‌ను ఇటీవలే ప్రారంభించిన భారత్.. ప్రపంచలోనే ఆ సామర్థ్యం కలిగిన ఐదో దేశంగా నిలిచిందని తెలిపారు. ఒకప్పుడు 2జీ నెట్‌వర్క్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్న భారత్‌లోని దాదాపు అన్ని జిల్లాల్లో నేడు 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. గత పదేళ్లలో డిజిటల్ స్పేస్‌లో భారత్ గణనీయమైన ప్రగతి సాధించిందని, దాని వల్లే కప్పు టీ కంటే తక్కువ ధరకు దేశంలో 1జీబీ వైర్‌లెస్ డేటా లభిస్తుందని పేర్కొన్నారు. సెమీకండక్టర్లు, మొబైళ్లు, ఎలకా్ట్రనిక్ వస్తువల ఉత్పత్తి రంగంలో భారతదేశంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పెట్టుబడిదారులు, స్టార్ట్‌పలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే, ఎలకా్ట్రనిక్ మాన్యూఫాక్చరింగ్‌కు సంబంధించిన అంతర్జాతీయ కంపెనీలతో భారత కంపెనీలు భాగస్వాములు కావాలని సూచించారు.
Comments