మళ్లీ 25,000 పైకి నిఫ్టీ 583 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
ముంబై: ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా మూడో రోజూ లాభపడ్డాయి. ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, హెల్త్‌కేర్ రంగ షేర్లలో కొనుగోళ్లతో సోమవారం సెన్సెక్స్ 582.95 పాయింట్లు బలపడి 81,790.12 వద్ద ముగిసింది. ఒక దశలో సూచీ 639.25 పాయింట్లు ఎగబాకి 81,846.42 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. నిఫ్టీ విషయానికొస్తే, 183.40 పాయింట్ల వృద్ధితో 25,077.65 వద్ద స్థిరపడింది. గడిచిన మూడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,500 పాయింట్లకు పైగా, నిఫ్టీ 466 పాయింట్లు లాభపడ్డాయి. ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.459.84 లక్షల కోట్లకు పెరిగింది.
నిరాశపరిచిన అమీన్జీ రబ్బర్: సోమవారం బీఎ్‌సఈ ఎస్ఎంఈ ఎక్స్ఛేంజీలో లిస్ట్ అయిన హైదరాబాద్ కేంద్రంగా ఉన్న అమీన్జీ రబ్బర్ లిమిటెడ్ మదుపరులను నిరాశపరిచింది. ఇటీవల రూ.30 కోట్ల సమీకరణ కోసం ఐపీఓకు వచ్చిన ఈ కంపెనీ ఒక్కో షేరును రూ.95-100కు జారీ చేసింది. సోమవారం బీఎ్‌సఈలో రూ.101 వద్ద లిస్టయిన కంపెనీ షేరు ఇంట్రాడేలో ఒక దశలో రూ.96.05కు పడిపోయింది. చివరికి రూ.6.05 స్వల్ప లాభంతో రూ.106.05 వద్ద ముగిసింది.
సాంప్రే న్యూట్రిషన్స్ లిమిటెడ్.. ఫారిన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్ల (ఎఫ్‌సీసీబీ) జారీ ద్వారా రూ.355 కోట్లు సమీకరించనుంది. ఈ మేరకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం లభించిందని కంపెనీ వెల్లడించింది. రూ.355.06 కోట్లకు సమానమైన ఎఫ్సీసీబీలను జారీ చేయటం ద్వారా ఈ మొత్తాలను సమీకరించనుంది. ఈ మొత్తాలను కంపెనీ ఈజిప్ట్, లైబీరియా సహా వర్ధమాన మార్కెట్లలో కార్యకలాపాలను విస్తరించేందుకు ఉపయోగించనుంది.
Comments