భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున అఖిల భారత సర్వీసు అధికారుల బదిలీలు చేపట్టింది. కొన్ని కీలక శాఖలకు విభాగాధిపతు(హెచ్‌వోడీ)లను, ఏడు జిల్లాలకు కొత్త జాయింట్ కలెక్టర్లను నియమించింది. మొత్తం 29 మందిని బదిలీ చేయగా ఇద్దరు అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్‌కుమార్ మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న కేవీఎన్ చక్రధర్‌బాబును సెకండరీ హెల్త్ డైరెక్టర్‌గా నియమించింది. మంజీర్ జిలానీని మార్క్‌ఫెడ్ నుంచి బదిలీ చేసి వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా నియమించింది. ఆయనకు ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్, మార్క్‌ఫెడ్‌ల ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. వ్యవసాయ శాఖలో ఉన్న ఎస్.డిల్లీరావును బదిలీ చేసి పౌరసరఫరాల సంస్థ వైస్‌చైర్మన్-ఎండీగా నియమించింది. కొంత మంది జూనియర్ ఐఏఎస్‌లను సచివాలయంలో డిప్యూటీ సెక్రటరీ స్థానాల్లో ప్రభుత్వం నియమించింది. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీగా సి.విష్ణు చరణ్, మెడికల్ అండ్ హెల్త్-ఎస్ .ఎస్.శోభిక, గృహనిర్మాణం డిప్యూటీ సెక్రటరీగా బీఎస్‌వీ త్రివినాగ్‌కు పోస్టింగ్‌లు లభించాయి. సాంఘిక సంక్షేమ కార్యదర్శిగా ఉన్న ప్రసన్న వెంకటేశ్‌కు లిడ్‌క్యాప్ వైస్‌చైర్మన్-ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. శాప్ ఎండీ ఎస్.భరణి యువజన సర్వీసుల శాఖ ఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు.
Comments